Thursday, September 5, 2019

ఆంజనేయుడు గురించి అనేక వివరాలు

ఆంజనేయుడు పంచముఖుడు

తలచుకున్నంత మాత్రాన సకల కష్టాలనూ చిటికెలో రూపుమాపేవాడు ఆంజనీ పుత్రుడు. శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది.

మైరావణ వృత్తాంతం: రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం... తెలిసిందే! రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలుపడిపోతాడు. వెంటనే పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా.... అందరి కళ్లూ కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు.

రామలక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు. మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది. అందుకోసం తూర్పు, పశ్చిమము, ఉత్తరము, దక్షిణము, ఊర్ధ్వముఖం... ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి, అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి... మైరావణుని అంతం చేస్తాడు. అతనే పంచముఖాంజనేయుడు.

స్వామివారి పంచముఖాలలో ఒకో మోముదీ ఒకో రూపం. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహావతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే అ అయిదు ముఖాలు తన భక్తులను అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నారసింహ ముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్షునీ, వరాహము అష్ట ఐశ్వర్యాలనీ, హయగ్రీవుడు జ్ఞానాన్నీ, ఆంజనేయ రూపం అభీష్టసిద్ధినీ కలుగచేస్తాయి.



ఆంజనేయుని ప్రార్థనలో కొన్ని ముఖ్యమైనవి..?


🌸 హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే స్వామి.

🌸 ఆంజనేయుడు, మారుతి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు. స్వామివారికి సంప్రదాయానుసారంగా శ్రీసీతారామ స్తుతి అత్యంత ప్రీతికరమైనది.

🌸 రక్షణకు, గ్రహదోష నివారణకు, ఆరోగ్యానికి, మృత్యుభయ విముక్తికి ఆంజనేయుని స్తుతించడం సర్వ సాధారణం.

🌸 ఆంజనేయుని ప్రార్థనలో కొన్ని ముఖ్యమైనవి:

1. హనుమాన్ చాలీసా: గోస్వామి తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా భారతదేశమంతటా ప్రసిద్ధమైన ప్రార్థన.

2. ఆంజనేయ స్తోత్రం: మనోజవం మారుత తుల్య వేగం.. వంటి శ్లోకాలతో కూడినది. ఇందులో అన్ని శ్లోకాలూ ప్రసిద్ధం.

3. శ్రీ ఆంజనేయ మంగళస్తుతి: వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే, పూర్వాభాద్రాప్రభుతాయ మంగళం శ్రీ హనుమతే..

4. శ్రీ మారుతీ స్తోత్రం: ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయి శ్రీమతే..

5. సుందరకాండ: సుందరకాండ పారాయణ కూడా హనుమదారాధనే అంటారు.

6. హనుమత్పంచరత్న స్తోత్రం: శంకర భగవత్పాదుల విరచితం.. వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛమ్సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్.

7. హనుమంతుని ద్వాదశ నామ స్తోత్రం.

8. ఆంజనేయ మంగళాష్టకం.

9. హనుమన్నమస్కార: గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసమ్ రామాయణమహామాలారత్నం వందేనిలాత్మజమ్.

10. ఆంజనేయ దండకం: శ్రీ ఆంజనేయం ప్రన్నాంజనేయం ప్రబాధివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం.. అని సాగే ఈ దండకం తెలుగునాట బాగా ప్రసిద్ధమైనది.

*ఆంజనేయ స్వామి అవతారాలు తొమ్మిది*

హనుమంతుడు కూడా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.

1. ప్రసన్నాంజనేయస్వామి.
2. వీరాంజనేయస్వామి.
3. వింశతిభుజాంజనేయస్వామి.
4. పంచముఖాంజనేయస్వామి.
5. అష్టాదశ భుజాంజనేయస్వామి.
6. సువర్చలాంజనేయస్వామి.
7. చతుర్భుజాంజనేయస్వామి.
8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి.
9. వానరాకార ఆంజనేయస్వామి

ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు - శనివారం, మంగళవారం మరియు గురువారం. పురాణకథ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.

*ఓం నమో ఆంజనేయ నమో నమః*


🙏🌹🙏 సూర్యాంజనేయం 🙏🌹🙏


శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనే స్తోత్రాలు చదివాం, విన్నాం కానీ ఈ సూర్యాంజనేయం అంటే? సూర్యుడు, ఆంజనేయుడికి ఉన్న సంబంధం మనం తెలుసుకోవలసిందే. వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి/ హనుమంతునికి సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడడు.. 🙏🌹🙏


బాలాంజనేయుడికి సూర్యుడు ఆహారం : హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఉదయభానుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎఱ్ఱని సూర్యబింబాన్ని పండుగా భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. కాని ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన విషయం మనకు తెలిసిందే. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించాడు. ఇది సూర్యాంజనేయుల మొదటి అనుబంధం.. 🙏🌹🙏


🙏🌹🙏 సూర్యశిష్యరికం 🙏🌹🙏


బాల్యంలోనే గాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి విద్యనూ అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతునికి నచ్చజెప్పటానికి చూశాడు. కాని చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకొని శిష్యుడిగా చేసుకోవడానికి సూర్యుడు అంగీకరించాడు. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యనూ అభ్యసించిన వివిధ పురాణాలు వేరు వేరుగా చెబుతున్నాయి. ఉదయాద్రిపై ఒక పాదం, అస్తాద్రిపై ఒక పాదం ఉంచి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేదవేదాంగాలు, ఆరు శాస్త్రాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలంకారాలు, 64 కళలు అభ్యసించాడు (గడియకు లక్షా డెబ్బై వేళ యోజనాల వేగంతో ప్రయాణించే సూర్యరథంతో సమానంగా సంచరిస్తూ హనుమంతుడు విద్యాభ్యాసం చేశాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి) జిజ్జ్వల్యమానంగా ప్రకాశించే నిత్య గమనశీలి సూర్యుని వద్ద శిష్యరికం చేసిన ఘనుడు వాయుపుత్రుడు ఒక్కడే. సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముని మొదటి సమగామంలోనే తన సంభాషణా చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు. మైనాకుని వినయంతోను, సింహికను శక్తితోను, సురసను యుక్తితోను జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే.. 🙏🌹🙏


🙏🌹🙏 సూర్యుపుత్రునికి స్నేహితుడు 🙏🌹🙏


సూర్యభగవానుని శిష్యుడైన హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి మంత్రిగా, మిత్రునిగా సలహాలను, సహాయాన్ని అందించాడు. వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి, సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే. అంతేగాక రావణ సంహారానికి తోడ్పడే నరవానర మైత్రికి బీజం వేసినవాడు కూడా హనుమంతుడే.. 🙏🌹🙏


సూర్యుని మనుమడు : కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి సూర్యుసుతుడైన సుగ్రీవునికి సోదరి. అంటే హనుమంతుడు సుగ్రీవునికి మేనల్లుడు. కనుక సూర్యుడు హనుమంతుడికి తాత.. 🙏🌹🙏


సూర్యుని అల్లుడు : వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎటువంటి ప్రస్తావన లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య. అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది. పార్వతీదేవి అంశతో అయోనిజగా సువర్చల జన్మించింది.. 🙏🌹🙏


సూర్యవంశీయుని భక్తుడు : హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాద్భాగ్యం హనుమంతునికి దక్కింది. గురువు ఋణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం. శ్రీరామునితో పరిచయమైనా నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ జాడ కనిపెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. సంజీవినిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.. 🙏🌹🙏


త్రిమూర్తుల శక్తి : సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు మహావిష్ణువు అవతారం. హనుమంతుడు శివాంశ సంభూతుడు. అంటే రామాంజనేయుల అనుబంధం శివకేశవుల అభేదానికి ప్రతీక. హనుమంతుని భవిష్యబ్రహ్మగా కూడా పురాణాలు పేర్కొన్నాయి. కనుక వీరిద్దరి కలయికతో త్రిమూర్తులు ఏకామైనట్టే. సూర్యుని కూడా త్రిమూత్రుల స్వరూపంగా శాస్త్రాలు నిర్వచించాయి. కాబట్టి శ్రీ సూర్యరామాంజనేయులను ద్విగుణీకృతమైన శక్తికి సంకేతంగా అభివర్ణించ వచ్చు. ఇలా గురుశిష్య బంధంగా మొదలైన సూర్యాంజనేయుల అనుబంధం త్రిమూర్త్యాత్మకంగా విస్తరించింది..



No comments:

Post a Comment